పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా ప్రాంతం మరోసారి వేడెక్కింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్‌పై పరిమిత స్థాయి సైనిక దాడులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా నలువైపులా నిర్బంధించి, సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించాలని ట్రంప్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా మిత్రదేశాలతో కలిసి నౌకాయాన భద్రతను పటిష్ఠం చేసే అంశంపై అగ్రరాజ్యం చర్చలు జరుపుతోంది.


మరోవైపు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఇప్పటికే సైన్యాన్ని ఆదేశించారు. ఇరాన్‌పై దాడుల పునరుద్ధరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే తుది నిర్ణయం కోసం ఇజ్రాయెల్ వేచి చూస్తోంది. ఒకవేళ ఈలోగా టెహ్రాన్ తమపై ఏవైనా దాడులకు పాల్పడితే, ఆ ప్రతిస్పందన ఊహించని రీతిలో ఉంటుందని ఇజ్రాయెల్ సైన్యం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.


ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు విఫలం కావడానికి అమెరికా మొండివైఖరే కారణమని ఆయన ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇస్లామాబాద్ ఒప్పందం వరకు వెళ్లినప్పటికీ, చివరి నిమిషంలో అమెరికా అతివాద లక్ష్యాలతో వెనక్కి తగ్గిందని మండిపడ్డారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు విఫలమవడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన... శత్రుత్వమే అమెరికా లక్ష్యమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో పశ్చిమాసియా ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని స్థితికి చేరుకుంది.


Donald Trump
Iran
United States
Israel
Middle East tensions
military strikes
Hormuz Strait
Israel Defense Forces
Abbas Araghchi
peace talks

More Telugu News